పిఠాపురం : 11 ఏళ్ల జనసేన ప్రస్థానంలో ప్రతిపక్షంలో ఉంది. ఎన్నో పోరాటాలు చేసిన మనం ఇప్పుడు అధికార భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో బాధ్యతగా వ్యవహరించాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ కె.నాగబాబు వెల్లడించారు. పిఠాపురం నియోజక వర్గం చిత్రాడలో నిర్వహించిన జనసేన పార్టీ ఆవిర్భావ సభ జయ కేతనంలో ప్రసంగించారు. బాధ్యత లేకుండా అడ్డగోలుగా మాట్లాడిన వైసీపీ నాయకులు పరిస్థితి ఇప్పుడు కళ్ళారా చూస్తున్నామని, అటువంటి పరిస్థితి ఇంకెవ్వరికి రాకూడదని నాగబాబు అన్నారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మొదటి నుంచీ మనకు క్రమశిక్షణ నూరి పోసారని అదే విధానంతో ఎప్పుడూ హుందాగా వ్యవహరించాలని అన్నారు. వైసీపీ నాయకుడు జగన్ నిద్రావస్థలో పిచ్చి కలలు కంటున్నారని ఇంకో 20 ఏళ్ల పాటు కలల్లోనే ఉండాలని ఎద్దేవా చేశారు. గంగా, యమున లాంటి జీవ నదులకు ప్రతీ పన్నెండేళ్ళకు పుష్కరాలు జరుగుతాయని ఆ కోవ లోనే నేడు జనసేన పుష్కర సంబరాలు జరుపుకుంటోందని అన్నారు. పవన్ కళ్యాణ్ ప్రయాణం, నేడు ఆయన చేస్తున్న అభివృద్ధి భావి తరాలకు మార్గ దర్శకం అవుతుందని అన్నారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు నాకు సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలుపుతున్నానని, ప్రభుత్వ పరిపాలనలో ప్రజా సేవ చేసేందుకు గాను, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఎన్నికయ్యే అవకాశం కల్పించి నా బాధ్యతను పెంచిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలుపుతూ, నామినేషన్ దాఖలు సందర్భంగా నాతో ఉన్న రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నారా లోకేష్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణకి ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు.