- స్వయంభూ కాకినాడ భోగిగణపతి పీఠంలో ‘232’వ సంకష్టహారచతుర్థి ఉత్సవం
కాకినాడ : కాకినాడ స్వయంభూ భోగిగణపతి పీఠంలో 232వ సంకష్టహారచతుర్థి సందర్భంగా ఉచ్చిష్ట గణపతికి లక్ష తెల్ల జిల్లేడు పువ్వులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 60మంది చైత్రమాస చతుర్థి ఉపవాసకులతో సుప్రభాతవేళ పీఠం మాఢ వీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ నగర సంకీర్తన జరిగింది. తెల్ల జిల్లేడు పుష్పాల పాలవెల్లితో, సహస్ర నామ పారాయణ, లక్ష వత్తులతో దీపారాధన, పంచామృతాలతో అభిషేకం, చంద్రునికి అర్ఘ్యం సమర్పించి ఉపవాసకులకు పసుపు, కుంకుమ, గాజులు, రవిక తాంబూలాలతో అల్పాహారం అందించారు. పీఠం ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ తెల్ల జిల్లేడు పుష్పాలతో క్రిష్ణపక్ష చతుర్థి వేళ గణేశునికి అర్చన చేయడం వలన కడిగినముత్యం వలె ప్రారబ్ధ కర్మలు పరిహారమవుతాయన్నారు. కాలజ్ఞాన స్వరూపంగా భోగియజ్ఞంలో నిలిపిన శతాధిక వత్సరాల రావి మాను దుంగ నుండి స్వయంభువుగా అగ్నిహోత్రంలో వెలిసిన విఘ్నేశ్వర స్వరూపాన్ని పరిరక్షించేందుకు పంచ లోహాల తాపడంతో కాంస్య కవచ యజ్ఞం జరిగిన సందర్బంగా గత ఏడాది నుండి ఉపవాసకులతో ప్రత్యేకంగా జరుగుతున్న సామూహిక చతుర్థిమాసోత్సవాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ చతుర్థివరకు జరుగుతాయన్నారు.