అడవులను కార్పొరేట్ శక్తులకు అప్పగించే లక్ష్యంతో మోడీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కగార్, హత్యాకాండకు నిరసనగా కోదాడ పట్టణంలో బస్టాండ్ ఎదురుగా వామపక్ష, ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు పాల్గొని మాట్లాడుతూ అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసం ఆపరేషన్ కగారు పేరుతో మోడీ ప్రభుత్వం మావోయిస్టులను, ఆదివాసీలను బూటకపు ఎన్కౌంటర్లు చేయడం సరైంది కాదని వారు అన్నారు. మావోయిస్టు పార్టీని లేకుండా చేయాలనే లక్ష్యంతో మావోయిస్టులను పట్టుకొని కాల్చి చంపి ఎన్కౌంటర్ అని మసి పూస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజుల క్రితం జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు 28 పైగా దళ సభ్యులను పోలీసు బలగాలు చుట్టుముట్టి కాల్చి చంపడం ఆనవాయతిగా మారిందన్నారు. ఈ దేశ ప్రధాని మావోయిస్టులను చంపడంను ఆమోదమేనంటూ భారత రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రధానమంత్రి హోదాలో ఉండి ఎక్స్ లో ప్రకటించడం సిగ్గుచేటు అన్నారు. భిన్న రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారిని అంతమొందిస్తే ఆ భావాజాలం, ఆలోచనలు అంతం అవుతాయి అనుకోవడం మూర్ఖత్వం అన్నారు. ఎన్కౌంటర్ పేర్లతో మావోయిస్టులను ఆదివాసులను కలిసి చంపటం వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్) రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు, సిపిఎం జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దొడ్డ వెంకటయ్య, ప్రజా చైతన్య వేదిక కన్వీనర్ రాయపూడి చిన్ని, పందిరి నాగిరెడ్డి, టీపీజేఏసీ కన్వీనర్ ముత్తవరపు రామారావు, జి ఎల్ యన్ రెడ్డి, సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పోటు లక్ష్మయ్య, సిపిఎం టౌన్ కార్యదర్శి ఎం ముత్యాలు, అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, ఐ ఎఫ్ టీ యు జిల్లా సహాయ కార్యదర్శి వక్కవంతుల నరసింహారావు, పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి, రమేష్, నాగేశ్వర్ రావు, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.