రాష్ట్ర ప్రభుత్వం వానకాల సీజన్ లో రైతాంగాన్ని ఆదుకునేందుకు సమగ్ర వ్యవసాయ ప్రణాళికలను ప్రకటించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సిపిఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం అవుతున్నందున ప్రభుత్వం తక్షణమే సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. ప్రతి రాష్ట్రం ప్రణాళికలు రూపొందించుకొని ఏ భూమిలో ఏ పంట పండుతుందో ప్రజలకు ఎంత పంట అవసరమో అంచనా వేసి వాటికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు, బ్యాంకు రుణాలు రైతాంగానికి అందించాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం కల్తీ విత్తనాలు, పురుగుల మందుల వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నకిలీ పురుగుల మందులు, విత్తనాలు లేకుండా చూడాలన్నారు. బనకచర్ల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం కాకుండా చూడాలన్నారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతాంగం ప్రతి సంవత్సరం వడ్డీ వ్యాపారస్తుల దగ్గర డబ్బులు తెచ్చుకొని వ్యవసాయానికి పెట్టుబడి పెడితే సక్రమంగా పంట పండగ పోవడంతో ఆత్మహత్యలకు రైతాంగం పాల్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలన్నారు. రాజకీయ జోక్యం లేకుండా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ప్రజల యొక్క ఆదాయం మొత్తం విద్య, వైద్యం, మద్యానికి ఖర్చు అవుతుందన్నారు. దీనితో రోజురోజుకు కొనుగోలు శక్తి తగ్గిపోతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యాన్ని ఆదాయ వనరులుగా చూస్తున్నారని అన్నారు. అధిక ధరలను నియంత్రించడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాయని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ శక్తుల లాభాల కోసం స్వప్రయోజనాల కోసం చూస్తుందని విమర్శించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు తప్ప ప్రజా సమస్యలపై చొరవ చూపడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగం, అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరి రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, నాగారపు పాండు, మట్టి పెళ్లి సైదులు, కోట గోపి, చెరుకు ఏకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
