నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి అందరికీ ఆదర్శప్రాయంగా బచ్చలకూరి జార్జి చివరి వరకు జీవించారని విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల సీతారామయ్య అన్నారు. ఆదివారం కోదాడ పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, రచయిత,తెలంగాణ ఉద్యమకారుడు, హేతువాది బచ్చలకూరి జార్జి సంతాప సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేద దళిత కుటుంబంలో జన్మించి స్వయం శక్తితో ఎదిగి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఉపాధ్యాయుడిగా ఎంతోమంది విద్యార్థులను ఉన్నత స్థానాలు చేరెందుకు కృషి చేశారని దళితుల్లో నిరక్షరాస్యత, అంటరానితనాన్ని రూపుమాపేందుకు తన భార్యతో కలిసి చదువు వెలుగు ఉద్యమంలో పని చేశారని ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. సమాజంలో జరుగుతున్న అణచివేత, కుల వివక్ష, అవినీతి, అక్రమాలు మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేశారని ఆయన సేవలను స్మరించారు. జార్జి మృతి సమాజానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి పందిరి రఘువర ప్రసాద్, పొట్ట జగన్మోహన్ రావు, విద్యాసాగర్, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు……..