ఆరు దశాబ్దాల పాటు ఎంతో మంది ఉద్యమకారులు పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరడం లేదని మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం వ్యవస్తాపకులు సామ అంజిరెడ్డి, జెఎసి కన్వీనర్ కుంట్ల ధర్మార్జున్, తెలంగాణ మలిదశ ఉద్యమకారులు మిర్యాల వెంకటేశ్వర్లు, కోడి సైదులు లు అన్నారు. బుధవారం స్థానిక రైతుబజార్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24న నిర్వహించే ఉద్యమకారుల పాదయాత్ర కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 24న సూర్యాపేటలో ప్రారంభమయ్యే ఉద్యమకారుల పాదయాత్ర ఉరూరా సాగుతూ ప్రజా ప్రతినిధులకు వినతులు సమర్పిస్తూ ఆఖరుగా భద్రచలం చేరుకొని ఉద్యమకారులను గుర్తించే సద్భుద్ధిని ప్రభుత్వానికి కల్పించాలని ఆ శ్రీరామచంద్రుడికి వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యమకారులను గుర్తించకపోవడంతో పాటు అమరుల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో ఉద్యమకారులను గుర్తించి వారి ఆకాంక్షలను నెరవేర్చడంతో పాటు వారికి తగిన గౌరవం కల్పిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ప్రతి పథకంలో అవకాశం కల్పిస్తామని, ఇండ్లు కట్టిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యమకారులను గుర్తించి తగిన గౌరవం కల్పించడంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని, సముచితరీతిలో పించన్లు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్రకు తెలంగాణ 1969 తొలిదశ ఉద్యమకారుల పూర్తి మద్దతు ప్రకటించి సంఘీబావం తెలుపుతున్నట్లు ఆ సంఘం నాయకులు బొమ్మిడి లక్ష్మినారాయణ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారులు కోతి మాధవి మధుసూదన్రెడ్డి, కిషన్, కె.గోపి, నరేంద్బణి విద్యాసాగర్, యూసుఫ్, చిత్రం భద్రమ్మ, మెడెబోయిన గంగయ్య, నకిరెకంటి మైసయ్య, కట్ట రాజు, మోర శైలేందర్ తదితరులు పాల్గొన్నారు.