సూర్యాపేట జిల్లా గ్రంథాలయం నిరుద్యోగ యువత ఉద్యోగం సాధించడానికి అండగా నిలుస్తుందని జిల్లా గ్రంధాలయ సంస్ధ చైర్మన్ వంగవీటి రామారావు అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా గ్రంథాలయం నందు 57 వ జాతీయ గ్రంధాలయ వారోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని అన్నారు. ధనిక, బీద తేడా లేకుండా గ్రంథాలయం అందరికి సేవలను అందిస్తుందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేస్తున్నారని, పిల్లలు ఉద్యోగం సాధించినప్పుడు తల్లిదండ్రులు పొందే ఆనందం మాటలలో చెప్పలేమని ఆయన అన్నారు.జిల్లా గ్రంథాలయం నందు నిరుద్యోగ యువతకు అవసరమైన పుస్తకాలతో పాటు వారికి సౌకర్యాలు కల్పిస్తున్న గ్రంధాలయ ఇంఛార్జ్ శ్యామ్ సుందర్ రెడ్డి కి అభినందనలు తెలిపారు.రోజుకు 12 గంటల పాటు జిల్లా గ్రంథాలయంలో చదివి నిరుద్యోగ యువత ఇటీవల 36 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని, వారందరికి అభినందనలు తెలియజేస్తూ వారిని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సెక్రటరీ బాలమ్మ, ఇంఛార్జ్ శ్యామ్ సుందర్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఇరుగు కోటేశ్వరి, పొనుగోటి నిర్మల, ఎన్ సి రోజా, విశ్రాంత లైబ్రేరియన్ వెంకట్, నాగేశ్వరరావు, బాలాజి నాయక్, రంగారావు, శ్రవణ్, విజయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.