రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న పలు సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక సర్వే పారదర్శకంగా చేపట్టాలని జిల్లాకలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, నూతన రేషన్ కార్డులు, మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను దృష్టిలో ఉంచుకుని వారు సోమవారం రామడుగు మండలం వెదిర గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, గోపాల్ రావు పేట గ్రామ శివారులో క్షేత్రస్థాయి సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ‘‘ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా సర్వే వివరాలు నమోదు చేయాలి. రేషన్ కార్డుల జారీకి సంబంధించి కుటుంబ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలి. రైతు భరోసా కింద కేవలం సాగు భూముల వివరాలే నమోదు చేయాలి. అలాగే, నిర్మాణాలు, కోళ్ల ఫామ్, రైస్ మిల్లుల వంటి పరిశ్రమలు ఉన్న స్థలాల వివరాలు నమోదు చేయొద్దు’’ అని ఆమె చెప్పారు.
ఇందిరా ఆత్మీయ భరోసా పథకానికి సంబంధించిన 2023-24లో కనీసం 20 రోజులు ఉపాధి పని చేసిన భూమి లేని కూలీలనే ఎంపిక చేయాలని, ఇందిరమ్మ ఇళ్ల కోసం అత్యంత నిరుపేదలకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, చొప్పదండి ఏడిఏ ప్రియదర్శిని, తహసీల్దార్ రామలక్ష్మి, ఎంపీడీవో రాజేశ్వరి, ఏవో త్రివేదిక తదితరులు పాల్గొన్నారు.