తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని సమూలంగా, సమున్నతంగా మార్చి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత బిఆర్ఎస్ ప్రభుత్వానిదేనని బి ఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి అన్నారు. గురువారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలొ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో 420 రోజులు అవుతుందని ఇచ్చిన హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించాడు. రోజురోజుకు కాంగ్రెస్ మోసకారి మాటలతో రైతులను, రైతు కూలీలను మోసం చేస్తుందన్నారు. రైతు భరోసా కింద ఎకరాకు 15000 ఇస్తామని నమ్మబలికి ఏడాది పాటు ఊరించి చివరికి 12000 ఇస్తామని చెప్పింది. వానాకాలం పెట్టుబడి సాయం ఎగ్గొట్టి రైతులను మళ్లీ అప్పుల పాలు చేస్తుందన్నారు. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వాన్ని రైతులు తగిన గుణపాఠం చెప్పక తప్పదు అన్నారు. ఈ కాంగ్రెస్ సర్కార్ కు ఇప్పటికైనా కళ్ళు తెరిపించాలని కోరుకుంటూ చెవిలో పువ్వులు పెట్టుకొని వినూత్నంగా బీఆర్ఎస్ శ్రేణులు గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగాల లక్ష్మణ్, కనగండ్ల తిరుపతి, చింతకింది శ్రీనివాస్ గుప్తా, కచ్చు రాజయ్య, నాయకులు గుబిరె మల్లేశం, నలువాల స్వామి, దీటి బాల నర్సు, బండారి రాములు,, బి ఆర్ ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జి ఎలా శేఖర్ బాబు, వంగల నరేష్, బిగుళ్ల మోహన్, తిప్పారపు మహేష్, కల్లూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

previous post