ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త అయిన శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్ లో మ్యాథ్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గాయత్రి విద్యా సంస్థల ఛైర్మన్ అల్లెంకి శ్రీనివాస్ , కరెస్పాండెంట్ రజనీ దేవి లు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ప్రదర్శనలో పాఠశాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు 200 కు పైగా గణిత నమూనాలను తయారుచేసి ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులు చేసిన పలు నమూనాలను ఆసక్తిగా పరిశీలించి, నమూనాల పని విధానాన్ని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ఆసక్తికర పజిల్స్, ఆటలు ఆడి పిల్లలను అనందపరిచారు. ఈ ఎగ్జిబిషన్ లో ట్రిగొనమెట్రీ పార్క్, జామెట్రీ పార్క్, కాసినో గేమ్, పైథాగరస్ సిద్ధాంతం నమూనా, పలు జ్యామితీయ, ఘాతాంకాల నమూనాలు అందరినీ ఆకర్షించాయి. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీనివాస రామానుజన్ మన భారతీయుడు కావడం మన అందరికీ గర్వకారణం అనీ, ఆయన ప్రతిపాదించిన పలు సిద్ధాంతాలు నేటికీ కూడా గణిత శాస్త్రవేత్తలు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన గణిత శాస్త్రమునకు చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు రాయల్ ఫెలోషిప్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అన్నారు. అనంతరం చాలా చక్కనైన గణిత నమూనాలను రూపొందించి, వాటిని వివరించిన విద్యార్థినీ విద్యార్థులను అభినందిస్తూ, ఈ గణిత ఎగ్జిబిషన్ ని విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన గణిత ఉపాధ్యాయులు రజియుద్దీన్, రాజ్ కుమార్, నవ్య, సుష్మలత లను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రామానుజన్ నెంబర్ అయిన 1729 ఆకృతిలో కూర్చొని నెంబర్ ని ఫామ్ చేయడం అందరినీ ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.