సూర్యాపేట: రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పంజాబ్, హర్యానా రాష్ట్రంలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసన కార్యక్రమాలు చేస్తున్న రైతాంగం పై పోలీసులు కర్కశంగా దాడి చేసి రైతుల శిబిరాలను కూల్చి అక్రమ కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా( ఎస్ కే యం ) జిల్లా కన్వీనర్ లు మండారి డేవిడ్ కుమార్, ములకలపల్లి రాములు, వరికుప్పల వెంకన్న, బూర వెంకటేశ్వర్లు, మట్టిపల్లి సైదులు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పంజాబ్, హర్యానా రాష్ట్రంలో రైతుల శిబిరాలను తొలగించి అక్రమ కేసులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ కే యం దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో శిబిరాలు ఏర్పాటు చేసుకొని పోరాటం చేస్తున్న రైతులపై పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ఆమ్ ఆద్మీ ప్రభుత్వం రైతుల శిబిరాలను ధ్వంసం చేసి 600 మంది రైతులను అరెస్టు చేసి 300 పైగా మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని ప్రభుత్వం తక్షణమే రైతులపై పెట్టిన కేసులను వెంటనే వెనుక తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమ్ ఆద్మీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరించడం తగదన్నారు. రైతాంగ సమస్యలు పరిష్కరించాలని దేశ రాజధాని ఢిల్లీలో ఏడాది పాటు ఆందోళన నిర్వహించడం మూలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెబుతూ 14 రాతపూర్వక హామీలు ఇచ్చిందన్నారు. హామీలు ఇచ్చి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బిజెపి ప్రభుత్వం గోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రైతుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల మరిన్ని పోరాటాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ కే యం జిల్లా నాయకులు షేక్ నజీర్, గంట నాగయ్య, వేల్పుల వెంకన్న, కు నుకుంట్ల సైదులు, ధనియాకుల శ్రీకాంత్, దాసరి శ్రీనివాస్, దేసోజు మధు, వీరబోయిన లింగయ్య, బోల్క పవన్, సుభాని తదితరులు పాల్గొన్నారు.