సూర్యాపేట : తలసేమియా బాధితుల కోసం ఎస్బీఐ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని ఎస్బీఐ సూర్యాపేట రీజినల్ మేనేజర్ బి.అనిల్ కుమార్ అన్నారు.జులై 1న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 70 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బుధవారం జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో గల ఎస్బీఐ టౌన్ బ్రాంచ్ లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని అన్నారు. గత ఏడు దశాబ్దాలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని వర్గాల ప్రజలకు సేవలు అందిస్తూ చేరువైందని అన్నారు.అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ బ్యాంకింగ్ రంగంలో ముందుందని అన్నారు.రైతులకు, విద్యార్థులకు, మహిళ సంఘాలకు,వ్యాపార రంగాల వారికి వివిధ రకాల రుణాలను అందించి వారి అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకు సాగుతున్నామన్నారు.పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ఎస్బీఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.మెగా రక్తదాన శిబిరం ద్వారా ఎస్బిఐ ఉద్యోగులు తలసేమియా బాధితులకు అండగా నిలబడటం అభినందనీయమని అన్నారు. 105 మంది ఉద్యోగులు రక్తదానం చేసినట్లు చెప్పారు. ఎస్బిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఉద్యోగుల రీజనల్ సెక్రెటరీ అయితగోని మహేష్, ఎస్బీఐ ఆఫీసర్స్ రీజనల్ సెక్రెటరీ విజయభాస్కర్, సేవా ఏజీఎస్ సురేందర్, టౌన్ బ్రాంచ్ మేనేజర్ సిహెచ్.ఫణి కుమార్, హెచ్ఆర్ మేనేజర్ విఠల్ బాబు, కిషోర్, క్రాంతి, అనిల్, మెడికల్ ఆఫీసర్ రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
