సూర్యాపేట:హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ప్రయత్నంలో భాగంగా బుల్డోజర్లతో అక్కడి చెట్లను తొలగించి, భూమిని చదును చేసి, జంతువులకు తీవ్ర ఇబ్బంది కల్గించే చర్యలకు పాల్పడుతున్నది. దీన్ని వ్యతిరేకించిన విద్యార్థులపై లాఠీఛార్జీ, అరెస్టులు, అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో ఇట్టి భూమిలో చెట్ల తొలగింపు, చదును చేయడం వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని సిపిఎం పార్టీ స్వాగతిస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గురువారం ఒక ప్రకటన అన్నారు. ఈ స్టేను దృష్టిలో పెట్టుకుని ఈ భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చర్యలకు పూనుకుంటే భవిష్యత్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని హెచ్చరించారు.
