మత్తు పదార్థాలకు,గంజాయికి యువత దూరంగా ఉండాలని మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ మండల యువతకు ఆదివారం ఒక పత్రిక ప్రకటనలో సూచించారు.మత్తు పదార్థాల వినియోగం కారణంగా యువత జీవితాలు దుర్భరమవుతున్నాయని అన్నారు.మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువత తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు.మత్తుతో జీవితాలు చిత్తు చేసుకోవద్దని, మాదక ద్రవ్యాల నిర్మూలన మన అందరి బాధ్యత అన్నారు.యువత డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు అలవాటు పడడం వల్ల దైనందిన విషయాలపై దృష్టి పెట్టకుండా క్రమేపీ ఆరోగ్యం క్షీణించడంతో పాటు అది ఒక వ్యసనంగా మారి,నేర ప్రవృత్తి వైపు దారితీస్తుందన్న విషయం ప్రతీ ఒక్కరు గమనించాలన్నారు.ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలంటే యువత,ప్రజలు, పోలీసులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాడుతేనే విజయం సాధించగలుగుతామని, డ్రగ్స్ మహమ్మారి ఎందరో జీవితాలను నాశనం చేస్తుందని దేశానికే వెన్నెముక అయిన యువతను కబలిస్తున్న ఈ డ్రగ్స్ ను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఎస్సై కోరారు.